పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత
- పుతిన్ భద్రత మరింత కట్టుదిట్టం
- బహిరంగ పర్యటనలను పూర్తిగా తగ్గించుకున్న పుతిన్
- పుతిన్ ఉండే ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలపై నిషేధం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్టు వస్తున్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో, పుతిన్ తన భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసుకోవడం గమనార్హం. ఈ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేతలలో పుతిన్ ఒకరు. రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ) ఆయనను 24 గంటలూ ఒక కవచంలా కాపాడుతుంది. మాస్కో అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని నెలల క్రితం నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ ప్రైవేట్ నివాసం వద్ద పుతిన్ పై హత్యాయత్నం జరిగింది. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. హత్యాయత్నం నేపథ్యంలో, పుతిన్ భద్రతను భారీగా పెంచారు.
ఈ కుట్ర నేపథ్యంలో పుతిన్ తన బహిరంగ పర్యటనలను పూర్తిగా తగ్గించుకున్నారు. యుద్ధ పర్యవేక్షణ కోసం ఆయన ఎక్కువ సమయం అత్యాధునిక సౌకర్యాలున్న భూగర్భ బంకర్లలోనే గడుపుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. పుతిన్ ఉండే ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలపై పూర్తి నిషేధం విధించారు. ఉక్రెయిన్ డ్రోన్ల ముప్పు నుంచి తప్పించుకోవడానికి మాస్కో నది వెంబడి భారీగా భద్రతా బలగాలను మోహరించారు.