బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్ విధానం ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడింది: జూపల్లి
- తుమ్మిడిహట్టి ద్వారా గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశం ఉందన్న జూపల్లి
- దాన్ని పక్కన పెట్టి కాళేశ్వరంను ఎంచుకున్నారని విమర్శ
- మేడిగడ్డ నిరుపయోగంగా మారిందని వ్యాఖ్య
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన సాగునీటి విధానాలపై విమర్శలు గుప్పించారు. సహజసిద్ధమైన ప్రవాహం (గ్రావిటీ) ద్వారా నీటిని అందించే అవకాశమున్న తుమ్మిడిహట్టిని పక్కన పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఖర్చుతో కూడిన 'లిఫ్ట్' విధానాన్ని ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని ఆయన మండిపడ్డారు.
2008లో వైసీపీ హయాంలో 16 లక్షల ఎకరాల లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ-డిజైన్ చేయడం వల్ల సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల రైతులకు అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తుమ్మిడిహట్టిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని జూపల్లి స్పష్టం చేశారు. 150 మీటర్ల బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని, దీనివల్ల పొరుగు రాష్ట్రంలో ముంపు సమస్య ఉండదని ఆయన వివరించారు.