ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • తనపై నమోదైన కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కోరిన అషురెడ్డి
  • దర్యాప్తు నిలిపివేతకు, కఠిన చర్యల నుంచి మినహాయింపునకు నిరాకరణ
  • పెళ్లి పేరుతో రూ.10.5 కోట్లు వసూలు చేశారంటూ ఆరోపణలు
  • కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 9కి వాయిదా
పెళ్లి పేరుతో ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసులో సినీ నటి అషురెడ్డికి (వెంకట అశ్వినిరెడ్డి) తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపైనా, తన తల్లి యశోదరెడ్డిపైనా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, దర్యాప్తును నిలిపివేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.

ఈ కేసుపై గురువారం జస్టిస్ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పోలీసులు తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని, దర్యాప్తును నిలిపివేయాలని అషురెడ్డి తరఫు న్యాయవాది కోరారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసు నమోదుకు తగిన ఆధారాలున్నాయని తెలిపారు. సుమారు రూ.10.5 కోట్ల నగదు బదిలీ ఆన్‌లైన్‌లోనే జరిగిందని, దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. ఇప్పటికే పిటిషనర్‌కు 41ఏ నోటీసులు జారీ చేశామని కూడా పేర్కొన్నారు.

లండన్‌లో ఉంటున్న తన కుమారుడు వై.వి.ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి, ఆమె తల్లి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వై. సత్యనారాయణమూర్తి హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేశారు.

Ashu Reddy
Ashu Reddy case
NRI fraud case
Yashoda Reddy
Hyderabad CCS Police
High Court
Financial fraud
YV Dharmendra
Y Satyanarayana Murthy
Criminal investigation

More Telugu News