విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్... బీజేపీ నేతలు ఖుష్బూ, కస్తూరి కీలక వ్యాఖ్యలు

Vijay TVK Government Formation Suspense Khushbu Sundar Comments
  • 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన ఖుష్బూ సుందర్
  • ప్రజలు ఎవరినైతే సీఎంగా కోరుకున్నారో వారినే నియమించాలన్న ఖుష్బూ
  • తమిళనాడు పౌరురాలిగా అదే కోరుకుంటున్నానని వ్యాఖ్య
ప్రముఖ నటి, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు పరోక్షంగా మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే పార్టీ అత్యధికంగా 108 సీట్లు గెలుచుకుంది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, ఐదుగురు ఎమ్మెల్యేలు కలిగిన కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో గవర్నర్ విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం లేదు.

ఈ క్రమంలో ఖుష్బూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రజలు ఎవరినైతే ముఖ్యమంత్రిగా కోరుకున్నారో వారిని నియమించాలని పేర్కొన్నారు. తమిళనాడు పౌరురాలిగా ఈ మేరకు కోరుకుంటున్నానని తెలిపారు. అంతకుముందు సినీ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి కూడా విజయ్‌కు మద్దతు పలికారు.

ప్రజలు విజయ్‌కి అనుకూలంగా ఓటు వేశారని, అందుకే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు. వారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్‌కి అవకాశమివ్వాలని అన్నారు. జాప్యం చేయాలని చూస్తే తమిళనాడు ప్రజలు, ఇతర ప్రాంతాల వారు కూడా కుట్రగా భావించవలసి వస్తుందని హెచ్చరించారు. వారు నేరుగా బీజేపీనే నిందిస్తారని పేర్కొన్నారు. విజయ్ మార్గంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకినైనా, అది నిజం కాకపోయినా, రాజ్యాంగపరమైన జాప్యంగా కాకుండా, కేవలం బీజేపీ ఆడుతున్న ఆటగా మాత్రమే చూస్తారని కస్తూరి పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijay TVK
Khushbu Sundar
Tamil Nadu Politics
BJP
Tamil Nadu Assembly Elections
TVK Party

More Telugu News