సత్య నాదెళ్ల వంటి వాళ్లు ఇచ్చే విరాళాలకు కూడా లెక్కలు లేవు: కవిత
- కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లు దండుకుంటున్నాయన్న కవిత
- ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపణ
విద్యా రంగంలో పెరుగుతున్న ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నాయని, వీటిని నియంత్రించకపోతే రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని కవిత హెచ్చరించారు.
విద్యాశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రే చూస్తున్నప్పటికీ, స్కూల్ ఫీజులు 50 నుండి 120 శాతం పెరిగినా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మే నెలలోనే 'ఫీజుల నియంత్రణ చట్టం' తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ఉన్నట్లుగా శాశ్వత నియంత్రణ అధికారిని నియమించాలని లేదా గుజరాత్ తరహాలో ప్రాథమిక, ఉన్నత విద్యలకు నిర్ణీత ఫీజుల పరిమితిని అమలు చేయాలని సూచించారు.
ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై స్పందిస్తూ... గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలని కవిత కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతి రావు కమిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల ధోరణిని అడ్డుకోవాలన్నారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని విద్యాసంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, దీనికి రాజకీయ నాయకులే మద్దతుగా నిలవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యవహారంపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఈ స్కూల్‌లో ఏకంగా 120 శాతం ఫీజు పెంచడం దారుణమని మండిపడ్డారు. స్కూల్ కమిటీలో ఉన్న ప్రభుత్వ పెద్దలు అక్కడి 30 ఎకరాల భూమిని కొట్టేసే కుట్ర చేస్తున్నారని, సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు ఇచ్చే విరాళాలకు లెక్కలు లేవని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని, లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని కవిత స్పష్టం చేశారు.