హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
- రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు
- గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల
ఈ రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో పంట రుణాల కోసం రూ.1.66 లక్షల కోట్లు కేటాయించారు. అదేవిధంగా, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు రూ.1.64 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. పశుసంవర్ధక శాఖకు రూ.34,972 కోట్లు, మత్స్య రంగానికి రూ.21,098 కోట్లు కేటాయించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. హార్టికల్చర్‌ను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకులు, నాబార్డు అధికారులు పూర్తి మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. ఏటా 450 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.5,313 కోట్లు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఎం.ఆర్. గోపాల్, జీఎం కే.వి.ఎస్. ప్రసాద్‌తో పాటు ఎస్ఎల్బీసీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.