తమిళనాట విజయ్ గెలుపు.. శ్రీలంకలో సంబరాలు
- విజయ్ గెలుపుతో విదేశాల్లో ఉన్న తమిళుల్లో కొత్త ఉత్సాహం
- శ్రీలంకలోని జాఫ్నా, ఉత్తర ప్రావిన్స్‌లో తమిళుల సంబరాలు
- జననాయగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ సాధించిన అఖండ విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయవార్త తెలియగానే పొరుగు దేశమైన శ్రీలంకలో, ముఖ్యంగా తమిళులు ఎక్కువగా నివసించే జాఫ్నా, ఉత్తర ప్రావిన్స్‌లో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, విజయ్ చిత్రపటాలతో ఊరేగింపులు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం సినీ అభిమానులే కాకుండా, అక్కడి తమిళ సంఘాలు, పలువురు రాజకీయ నేతలు కూడా విజయ్ను 'జననాయగన్' అని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండటంతో ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
తన రాజకీయ అరంగేట్రంలోనే దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఢీకొట్టి విజయ్ సాధించిన ఈ విజయం ఒక అద్భుతంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 100కు పైగా స్థానాలను కైవసం చేసుకుని, ఏకంగా 35 శాతానికి పైగా ఓట్ షేర్ సాధించడం ద్వారా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక సంచలనం. ఈ పరిణామం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లోని తమిళ యువతను విశేషంగా ఆకర్షించింది. ఒక నటుడిగా కాకుండా, ఒక ఆశాకిరణంగా విజయ్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తుండటం విశేషం.