విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్

  • టీవీకే పేరును ప్రస్తావించకుండా పేర్కొన్న స్టాలిన్
  • తమకు 1.54 కోట్ల ఓట్లువచ్చాయని వెల్లడి
  • టీవీకేకు, తమకు మధ్య 17.43 లక్షల ఓట్ల తేడా ఉందని వెల్లడి
విజయ్ టీవీకే పార్టీకి, తమకు మధ్య ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమేనని డీఎంకే పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి సందేశం పంపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి అభ్యర్థులకు ఓటువేసిన వారందరికీ మొదట ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమకు పడిన ప్రతి ఓటు అమూల్యమైనదని, తమపై ఉంచిన విశ్వాసానికి గుర్తుగా భావిస్తున్నామని అన్నారు. డీఎంకే కూటమి 1 కోటి 54 లక్షల 82 వేల 782 ఓట్లు సాధించిందని తెలిపారు. ఫలితాల్లో తమకంటే ముందున్న పార్టీ డీఎంకే కంటే కేవలం 17.43 లక్షల ఓట్లను మాత్రమే ఎక్కువగా పొందిందని విజయ్ పార్టీ టీవీకేను ఉద్దేశించి అన్నారు.

ఫలితాల్లో ముందున్న పార్టీకి, తమ పార్టీకి ఓట్ల వ్యత్యాసం కేవలం 3.52 శాతమేనని తెలిపారు. అంతిమంగా తమిళనాడు ప్రజలు తమపై ఉంచిన నమ్మకం చాలా బలమైనదని అన్నారు. మాకు ఓటువేసి గెలిపించిన ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేస్తుంటామని, కాబట్టి గెలిచిన పార్టీ అభ్యర్థులు ప్రజలను నేరుగా కలవాలని సూచించారు. మనం పార్టీని నడుపుతున్నదే ప్రజల కోసమని, వారి కోసమే మనం రాజకీయాల్లో ఉంటున్నామని పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయడం కర్తవ్యంగా భావించాలని అన్నారు.

డీఎంకే రాష్ట్రంలో ఆరుసార్లు అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఇన్నేళ్ల రాజకీయంలో తాము చూడని విజయం లేదని, తాము ఎదుర్కోని ఓటమి లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఓడిపోవచ్చు కానీ, ప్రజాజీవితంలో, సిద్ధాంతాన్ని నిలబెట్టడంలో తాము ఎప్పుడూ ఓటమి దరిచేరకుండా జాగ్రత్తగా ఉంటున్నామని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా, అన్నింటినీ సమానంగా చూస్తూ, మా సిద్ధాంతాల వైపు ప్రయాణించే వారే తమకు సహచరులుగా ఉంటారని అన్నారు.

డీఎంకే ఓడిపోయిందంటూ చాలామంది తనకు ఓదార్పు సందేశాలు పంపిస్తున్నారని, కానీ ప్రజల కారణంగానే తాము ఈ స్థాయికి చేరుకున్నామని, కాబట్టి ప్రజలు ఉన్నంత కాలం తమకు ఎలాంటి ఆందోళన లేదని పేర్కొన్నారు. 1.54 కోట్ల మంది ఓటు వేశారని, వారికి ప్రతిఫలంగా తాము ఏమివ్వగలమని పేర్కొన్నారు. పార్టీకి చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలం అనే భావనతో ముందుకు సాగుదామని అన్నారు.

తాము అధికారంలో ఉంటే ప్రజలకోసం పథకాలను రూపొందిస్తామని, ప్రతిపక్షంలో కూర్చుంటే ప్రజా సమస్యలపై పోరాడుతామని అన్నారు. ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల కోసం రాజకీయాలు చేస్తామని వ్యాఖ్యానించారు. పెరియార్, కరుణానిధిల అడుగుజాడల్లో నడుస్తూ, జాతి, భాష, దేశాన్ని పరిరక్షిస్తూ శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమ విధానాలను అమలు చేసే విధంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ ప్రయాణంలో డీఎంకే మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

MK Stalin
DMK
Tamil Nadu Elections
TVK
Vijay TVK Party
Tamil Nadu Politics
Karunanidhi
Dravidian Movement

More Telugu News