తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!

  • తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే
  • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన పార్టీ
  • విజయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకే మిత్రపక్షాలు
  • మద్దతుపై స్పష్టత ఇవ్వని డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్
  • తదుపరి వ్యూహాలపై ఎమ్మెల్యేలతో సమావేశమైన నటుడు విజయ్
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటు మార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన విజయ్‌కు మద్దతిచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి పక్షాలు సుముఖంగా లేవని స్పష్టం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది.

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగ్గా, నిన్న‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. తొలిసారే బరిలోకి దిగిన విజయ్ పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద శక్తిగా నిలిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు 10 స్థానాల దూరంలో ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాలకు తెరపడింది. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే) ప్రధాన కార్యదర్శి వైగో మాట్లాడుతూ... "విజయ్ పార్టీకి మద్దతిచ్చే ఆలోచన డీఎంకే కూటమిలోని ఏ పార్టీకి లేదు" అని స్ప‌ష్టం చేశారు. ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) నేత థోల్. తిరుమావళవన్ వ్యక్తం చేశారు. "మేమంతా లౌకిక రాజకీయ మార్గంలో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నాం. భవిష్యత్తులో కూడా కీలక నిర్ణయాలు కలిసే తీసుకుంటాం. టీవీకేకు మద్దతివ్వడంపై ఇప్పటివరకు ఆలోచించలేదు" అని ఆయన వివరించారు.

మరోవైపు దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అధినేత్రి ప్రేమలత విజయకాంత్ కూడా మద్దతుపై స్పష్టత ఇవ్వలేదు. తన భర్త విజయకాంత్‌తో విజయ్‌కు మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. "విజయ్ మా ఇంటి బిడ్డ లాంటివాడు. కెప్టెన్‌కు చాలా సన్నిహితుడు. ఆయన గెలుపునకు అభినందనలు" అని పేర్కొన్నప్పటికీ, మద్దతుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. డీఎంకే కూటమిలో 10 స్థానాల్లో పోటీ చేసిన డీఎండీకే కేవలం విరుధాచలం స్థానంలో మాత్రమే గెలిచింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఓటమిపాలు కావడంతో కూటమిలో సంబరాల వాతావరణం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభన నడుమ, విజయ్ చెన్నైలోని పనైయూర్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. మద్దతు ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Vijay
Tamil Nadu Politics
Tamilaga Vettri Kazhagam
TVK
DMK alliance
MDMK
Vaiko
VCK
Thol Thirumavalavan
Premalatha Vijayakanth

More Telugu News