'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు'... అంబ‌టి సెటైరిక‌ల్ ట్వీట్

  • తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చ
  • పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్
  • టీడీపీ ప్రభుత్వం పైనా అంబటి జోస్యం.. గట్టిగా బదులిస్తున్న టీడీపీ శ్రేణులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

తమిళనాడులో విజయ్ విజయం తర్వాత పవన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయని ప్రస్తావిస్తూ.. 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన‌ట్టు' అంటూ అంబటి ఓ పోస్ట్ పెట్టారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఒంటరిగా పోటీ చేసి గెలవగా, పవన్ కల్యాణ్ పొత్తుల ద్వారా విజయం సాధించడాన్ని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇదే క్రమంలో అంబటి మరో ట్వీట్‌లో చంద్రబాబు-లోకేశ్ ప్రభుత్వంపైనా జోస్యం చెప్పారు. తమిళనాడులో స్టాలిన్-ఉదయనిధి ప్రభుత్వానికి పట్టిన గతే భవిష్యత్తులో ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే, అంబటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గట్టిగానే బదులిస్తున్నాయి. 'ముందు మీకున్న 11 సీట్లను కాపాడుకోండి' అంటూ కౌంటర్ ఇస్తున్నాయి. దీంతో అంబటి ట్వీట్లు, వాటికి వస్తున్న ప్రత్యుత్తరాలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Ambati Rambabu
Pawan Kalyan
Janasena
YCP
Vijay Thalapathy
Tamil Nadu Elections
Andhra Pradesh Politics
TDP
Nara Lokesh
Political Satire

More Telugu News