తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా

  • తమిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఏకైక సంస్థ యాక్సిస్ మై ఇండియా
  • మా అంచనాలు విని రాజకీయ పండితులు, ఇతర సంస్థలు నవ్వాయని చెప్పిన ప్రదీప్ గుప్తా
  • ఇది క్షేత్రస్థాయి సర్వే, డేటా సైన్స్ సాధించిన విజయమని వెల్లడి
  • యువత, మహిళల ఓట్లే విజయ్ పార్టీ గెలుపునకు కారణమని విశ్లేషణ
  • డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని అంచనా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) గెలుస్తుందని తాము ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినప్పుడు, దేశంలోని రాజకీయ పండితులు, విశ్లేషకులు, ఇతర పోలింగ్ ఏజెన్సీల వాళ్లు తమను చూసి నవ్వారని యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్ ప్రదీప్ గుప్తా అన్నారు. నేడు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు.

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీకి 234 స్థానాల అసెంబ్లీలో 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో యాక్సిస్ మై ఇండియా మాత్రమే అంచనా వేసింది. తాజా ఫలితాల సరళి ప్రకారం టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సంచలనం సృష్టిస్తోంది. "ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. ఇతర సంస్థలు క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోలేకపోయాయి. మేము మాత్రం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సర్వే చేశాం. అందుకే మా అంచనాలు నిజమయ్యాయి" అని ప్రదీప్ గుప్తా వివరించారు.

విజయ్ పార్టీ గెలుపు వెనుక ఉన్న కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. తమిళనాడు ఓటర్లలో 42 శాతం ఉన్న 18 నుంచి 39 ఏళ్ల యువత విజయ్‌కి బ్రహ్మరథం పట్టిందని తెలిపారు. అలాగే, మహిళల ఓట్లు కూడా డీఎంకే తర్వాత అత్యధికంగా టీవీకేకే పడ్డాయని తమ సర్వేలో తేలిందని ఆయన పేర్కొన్నారు.

ఓట్ల శాతం విషయంలోనూ తమ అంచనాలు దాదాపుగా సరైనవేనని గుప్తా తెలిపారు. టీవీకేకి 35 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వేయగా, ప్రస్తుత ట్రెండ్స్‌లోనూ అదే స్థాయిలో ఓట్లు వస్తున్నాయన్నారు. డీఎంకేకి తాము 35 శాతం అంచనా వేయగా 32 శాతం వచ్చాయని, అన్నాడీఎంకేకి 23 శాతం అంచనా వేయగా 27 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రెండో స్థానంలో, పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని చెప్పామని ఆయన వెల్లడించారు. 

Axis My India
Vijay
Tamil Nadu Elections
Tamilaga Vettri Kazhagam
TVK
Pradeep Gupta
Exit Polls
DMK
ADMK
Tamil Nadu Politics

More Telugu News