ఈ ఫలితాలపై విజయ్‌కి ఒక్క శాతం కూడా డౌట్ లేదు: తండ్రి చంద్రశేఖర్

  • తమిళనాట దూసుకెళుతున్న టీవీకే.. 111 స్థానాల్లో ఆధిక్యం
  • కాంగ్రెస్‌కు పొత్తుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటన
  • ఇది విజయ్ 30 ఏళ్ల కల అని వివరించిన తండ్రి చంద్రశేఖర్
  • కొడుకు విజయంపై తల్లి శోభ ఆనందం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తన కుమారుడు విజయ్‌కి ఒక్క శాతం కూడా సందేహం లేదని ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళి విజయ్ పార్టీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సోమవారం వెలువడుతున్న కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే, మధ్యాహ్నం 2 గంటల సమయానికి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఏకంగా 111 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డీఎంకే 53, అన్నాడీఎంకే 59 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118కి టీవీకే చేరువవుతుండటంతో రాష్ట్రంలో ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమని కీలక సంకేతాలిచ్చారు. "ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన అధికారాన్ని కోల్పోయింది. ఆ పవర్‌ను విజయ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు" అని ఆయన స్పష్టం చేశారు.

గత 30 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఏదైనా మంచి చేయాలని విజయ్ ఆలోచిస్తున్నాడని చంద్రశేఖర్ తెలిపారు. "కేవలం నటుడిగానే కాకుండా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఉండాలని నేను అతడిని ప్రోత్సహించాను. తమిళ ప్రజలు అతడిని ఒక నాయకుడిగా కాకుండా, తమ సొంత బిడ్డగా, సోదరుడిగా చూస్తారు" అని ఆయన వివరించారు. ఈ ఫలితాలపై విజయ్ తల్లి శోభ సైతం తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆమె మురిసిపోయారు.

తమ కుమారుడు విజయ్ గెలవాలని ఆకాంక్షిస్తూ చంద్రశేఖర్, శోభ దంపతులు నేడు తిరుత్తణిలోని మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

Vijay
Tamil Nadu elections
SA Chandrasekhar
Tamilaga Vetri Kazhagam
TVK
Tamil Nadu politics
Congress alliance
Shoba Vijay
Thiruttani Murugan Temple

More Telugu News