ఒమన్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ.. సురక్షితంగా రప్పిస్తున్న ప్రభుత్వం

  • ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ షెహనాజ్
  • 'నన్ను కాపాడండి' అంటూ పవన్ కల్యాణ్‌కు వీడియో సందేశం
  • వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం, ఏపీ ప్రభుత్వం
  • ఏపీఎన్ఆర్‌టీఎస్ జోక్యంతో ఫలించిన చర్చలు
  • ఈ నెల‌ 7న సురక్షితంగా సొంతూరుకు తిరిగి రానున్న బాధితురాలు
ఉపాధి కోసం ఒమన్ వెళ్లి, అక్కడ యజమాని వేధింపులకు గురై నిర్బంధంలో చిక్కుకున్న ఏపీకి చెందిన మహిళను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొస్తోంది. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన దుదేకుల షెహనాజ్, ప్రభుత్వ జోక్యంతో ఈ నెల‌ 7న తిరిగి సొంతూరుకు రానున్నారు. ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీఎస్), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రత్యేక చొరవతో ఈ సమస్యకు ముగింపు పడింది.

గత నవంబర్‌లో ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన షెహనాజ్, అక్కడి పని నచ్చక తిరిగి రావాలనుకున్నారు. కానీ, యజమాని ఆమెను అనుమతించకుండా నిర్బంధించి, ఫోన్ లాక్కున్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన షెహనాజ్... "పవన్ కల్యాణ్ అన్న, నన్ను కాపాడండి. ఇక్కడ కొడుతున్నారు, తిండి, నీళ్లు కూడా ఇవ్వడం లేదు. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది" అంటూ కన్నీటితో ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంపారు.

ఈ వీడియో చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆమెను వెంటనే వెనక్కి రప్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు తక్షణమే రంగంలోకి దిగి, షెహనాజ్ భర్త ద్వారా ఒమన్‌లోని ఏజెంట్‌తో మాట్లాడారు. అదే సమయంలో భారత విదేశాంగ శాఖ, మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు.

మరోవైపు షెహనాజ్ భర్త అబూబకర్ ఏపీఎన్ఆర్‌టీఎస్‌కు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. ప్రభుత్వ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం తొలుత ఏజెంట్ ఖర్చుల కింద రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, స్థానిక పోలీసుల జోక్యంతో జరిగిన చర్చల తర్వాత ఏజెంట్ తన ఖర్చులతోనే షెహనాజ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపడానికి అంగీకరించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, వలస కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. షెహనాజ్‌ను వెనక్కి తీసుకురావడంలో చొరవ చూపిన ఏపీఎన్ఆర్‌టీఎస్ అధికారులను ఆయన అభినందించారు.



Pawan Kalyan
Andhra Pradesh
Oman
APNRTS
stranded woman
labor exploitation
Muscat
Chandrababu Naidu
repatriation
domestic violence

More Telugu News