మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన పవన్ కల్యాణ్

  • మస్కట్‌లో వేధింపులకు గురవుతున్న అన్నమయ్య జిల్లా మహిళ
  • రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి
  • వెంటనే స్పందించి అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
  • స్వదేశానికి రప్పించేందుకు వేగంగా చర్యలు
  • భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు
కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ తీవ్ర వేధింపులకు గురవుతూ, తనను కాపాడాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు పంపిన వీడియో సందేశంపై ఆయన తక్షణమే స్పందించారు. ఆమెను వెంటనే స్వదేశానికి రప్పించాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మహిళ, పని చేసే చోట యజమానుల వేధింపులు తాళలేకపోయింది. "పవన్ కల్యాణ్ అన్నా కాపాడన్నా" అంటూ రోదిస్తూ ఆమె సోషల్ మీడియా ద్వారా పంపిన వీడియో ఉప ముఖ్యమంత్రిని కదిలించింది. తనకు తిండి, నీళ్లు కూడా పెట్టకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారు.

ఈ వీడియో చూసి చలించిన పవన్ కల్యాణ్, షెహనాజ్‌ను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. అధికారులు వెంటనే షెహనాజ్ భర్త ద్వారా ఒమన్‌లోని ఏజెంట్‌తో మాట్లాడారు. అదే సమయంలో, మస్కట్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని, భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించి, ఆమెను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

షెహనాజ్‌ను సురక్షితంగా స్వదేశానికి రప్పించే ఈ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Pawan Kalyan
Muscat
Telugu Woman
Dudekula Shehnaz
Oman
Andhra Pradesh
NRI Help
Indian Embassy
Foreign Affairs

More Telugu News