ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం

  • లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి
  • టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన
  • కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు
  • ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అమలు చేసిన '100 రోజుల ప్రణాళిక'తో ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించాయని, ఇది ప్రభుత్వ విద్యారంగంలో ఒక నూతన అధ్యాయమని శాసనమండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు కొనియాడారు. ఈ విజయాలను పురస్కరించుకుని ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థినీ, విద్యార్థులను విజయనగరంలో ఆదివారం ఘనంగా సత్కరించారు.

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డా. వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో ఈ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా టాపర్లుగా నిలిచిన ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయల నగదు బహుమతి, మెరిట్ సర్టిఫికేట్ అందజేశారు. విద్యార్థుల విజయానికి కారణమైన వారి తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా శాలువాలతో గౌరవించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విప్ వేపాడ మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. "గత ఏడాది 81.1 శాతం ఉత్తీర్ణత నమోదైతే, ఈ ఏడాది వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడంతో అది 85.25 శాతానికి పెరిగింది. ఇది చిన్న విషయం కాదు," అని ఆయన పేర్కొన్నారు. 

"ప్రధాన పత్రికల మొదటి పేజీ ప్రకటనలు కేవలం కార్పొరేట్ సంస్థలకే సొంతం కాదు, మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకూ ఆ హక్కు ఉందని మీరు నిరూపించారు" అంటూ విద్యార్థులను ఆయన ఉత్సాహపరిచారు. ద్విభాషా క్వశ్చన్ బ్యాంకులు, 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, ప్రభుత్వం అందిస్తున్న ‘తల్లికి వందనం’ వంటి పథకాలు ఈ విజయానికి ఎంతగానో దోహదపడ్డాయని వివరించారు.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందించిన సంక్షేమ పథకాలు ఒకవైపు, పక్కా కార్యాచరణ ప్రణాళిక, పర్యవేక్షణ మరోవైపు సమన్వయంతో సాగడం వల్లే పదో తరగతిలో ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరారు.

ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 5.22 శాతం మెరుగైన ఫలితాలు సాధించి ‘భళా బాలిక’ అనిపించుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, విద్యా శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ముత్యాలనాయుడు, మాజీ రిజిస్ట్రార్ ఉమా మహేశ్వరరావు, వైజాగ్ డీఈఓ ప్రేమ్ కుమార్, శ్రీకాకుళం డీఈఓ రవికుమార్, విజయనగరం డీఈఓ మాణిక్యాల నాయుడు, మన్యం జిల్లా డీఈఓ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ విద్యారంగంలో ఒక నూతన ఒరవడికి, సరికొత్త ఉత్సాహానికి నాంది పలికాయని వక్తలు అభిప్రాయపడ్డారు.

Vepada Chiranjeevi Rao
ఉత్తరాంధ్ర districts
Vizianagaram
Nara Lokesh
AP SSC Results
Andhra Pradesh education
10th class toppers
government schools
Kalisetti Appalanaidu
Aditi Gajapathi Raju

More Telugu News