మధ్యప్రదేశ్ ప్రమాదంతో అప్రమత్తం.. తెలంగాణలో బోటింగ్‌పై కఠిన నిబంధనలు

  • మధ్యప్రదేశ్ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలో బోటింగ్ భద్రతపై ఆంక్షలు
  • రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాలకు పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త ఆదేశాలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే యూనిట్ మేనేజర్లపై వేటు తప్పదని హెచ్చరిక
  • ఓవర్ లోడింగ్, లైఫ్ జాకెట్ల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • ప్రతికూల వాతావరణంలో బోటింగ్ సర్వీసులు నిలిపివేయాలని ఉత్తర్వులు
మధ్యప్రదేశ్‌లోని బార్గి రిజర్వాయర్‌లో ఇటీవల జరిగిన ఘోర పడవ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాల్లో కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో పర్యాటకుల రద్దీ పెరుగుతున్నందున, బోటింగ్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత యూనిట్ మేనేజర్లు, ఇన్‌ఛార్జ్‌లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వారాంతాలు, సెలవు దినాలు, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అధికారులు తప్పనిసరిగా బోటింగ్ యూనిట్ల వద్ద భౌతికంగా హాజరు కావాలని ఆదేశించింది.

బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం (ఓవర్ లోడింగ్), ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు అందించకపోవడం వంటి ఉల్లంఘనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై సస్పెన్షన్‌తో సహా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు బోటింగ్ సర్వీసులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రతి బోటింగ్ యూనిట్‌లో ప్రథమ చికిత్స కిట్లు, రెస్క్యూ పరికరాలు, అత్యవసర ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశామని అధికారులు తెలిపారు.

Telangana Tourism Development Corporation
Telangana boating
boating regulations
Madhya Pradesh accident
boat accident
Telangana tourism
lake safety
boating safety
Telangana government
tourism safety

More Telugu News