ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

  • వేసవిలో విద్యుత్ కోతలు ఉండొద్దన్న మంత్రి గొట్టిపాటి
  • అధికారిక, అనధికారిక కోతలకు ఆస్కారం ఇవ్వొద్దని వెల్లడి
  • పెరిగిన డిమాండ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల సీఎండీలతో మంత్రి సమీక్ష
  • సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరించాలని సూచన
విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలో వేసవి డిమాండ్ ఎంత పెరిగినా విద్యుత్ కోతలు విధించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎక్కడా కరెంట్ పోకూడదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్తు సంస్థల ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతో (సీఎండీలు) మంత్రి నిన్న టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.
 
 రాష్ట్రంలో సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని మంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. అధిక వేడి కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం, అకాల వర్షాలతో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల కొన్నిచోట్ల స్థానికంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయని వివరించారు.
 
 కారణం ఏదైనా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని మంత్రి సూచించారు. తాత్కాలికంగా సమస్యలు వచ్చినా యుద్ధప్రాతిపదికన స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.

Gottipati Ravikumar
AP electricity
Andhra Pradesh power supply
AP power cuts
Summer power demand
Electricity department AP
AP electricity minister
Power supply review
Transformer failures
Unscheduled power cuts

More Telugu News