రాజకీయ నిరసనల్లో జంతువుల వాడకంపై రష్మీ ఫైర్: ట్రోలర్లకు గట్టి కౌంటర్!
- ఎడ్లబండిపై ఆటోను ఉంచి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత అభినయ్ రెడ్డి
- రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అన్న రష్మీ
- తాను ఏ పార్టీకి వ్యతిరేకి కాదని వెల్లడి
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి (భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు) ఆటోను ఎడ్లబండిపై ఉంచి ర్యాలీ నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు. రాజకీయ ప్రచారం కోసం మూగజీవాలను హింసించడం హేయమైన చర్య అని ఆమె మండిపడటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
దీనిపై రష్మీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఘాటు సమాధానమిచ్చారు. తాను ఏ మతానికో లేదా రాజకీయ పార్టీకో వ్యతిరేకిని కాదని, కేవలం జంతువులపై జరిగే క్రూరత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. గతంలో జంతుబలుల గురించి మాట్లాడినా, ఏనుగులపై జరిగే హింసను ప్రశ్నించినా తనను తిట్టారని, చివరకు దేశద్రోహి అని కూడా పిలిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అయితే జంతు సంక్షేమం కోసం నిజాయతీగా కృషి చేస్తుందో, ఆ పార్టీకి తాను బహిరంగంగా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అనవసర విమర్శలు మానేసి జరుగుతున్న హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు హితవు పలికారు.