ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కోవర్ట్: ధర్మపురి అర్వింద్
- ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపిస్తున్నారన్న అర్వింద్
- ఇరిగేషన్ శాఖలో కేసీఆర్ మనుషులనే ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారని విమర్శ
- కాళేశ్వరం కంటే ఉత్తమ్ శాఖలో ఎక్కువ అవినీతి జరుగుతోందని ఆరోపణ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్యాస్ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను 'పిల్ల చేష్టలు'గా అభివర్ణించారు. కనీసం దుస్తులు, చెప్పులు కూడా సరిగా వేసుకోవడం తెలియని వ్యక్తి దేశంలో ప్రధాన విపక్ష నేతగా ఉండటం సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ప్రజాక్షేమం కంటే తన కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. రేవంత్ పాలనలో రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనం ఏమీ లేదని ఆయన విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు 'కోవర్ట్' అని సంబోధిస్తూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని శాఖల కంటే సివిల్ సప్లై శాఖలోనే భారీగా అవినీతి జరుగుతోందని అన్నారు.
ఇరిగేషన్ శాఖలో కూడా కేసీఆర్ మనుషులనే ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కంటే ఉత్తమ్ శాఖలో జరుగుతున్న అవినీతి పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అక్రమాల విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని రక్షించేందుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.