లోకేశ్ పై వెంకయ్యనాయుడు ప్రశంసలు

Venkaiah Naidu Praises Nara Lokeshs Efforts
  • పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఘనతను ప్రశంసించిన వెంకయ్యనాయుడు
  • లోకేశ్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంస
  • తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదని ఆవేదన

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో ఈరోజు పర్యటించిన ఆయన, శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి జీవిత చరిత్ర 'విశ్వంభరుడు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్య, కుటుంబం మరియు సామాజిక విలువలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్ర విద్యాశాఖలో వస్తున్న మార్పులను వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఘనతను ఆయన కొనియాడారు. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, మంచి పనులు చేసే వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

ఇక, "నా కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్‌ల వ్యాపారాల్లో నేను జోక్యం చేసుకోను. నా రాజకీయాల్లోకి వారు రావొద్దు అని మా మధ్య ఒక గౌరవ ఒప్పందం ఉంది" అని ఆయన తెలిపారు. నేటి కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు సమయాన్ని కేటాయించడం లేదని, టీవీలు, మొబైళ్లకే పరిమితం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో గడపడం ద్వారానే మంచి విలువలను అందించగలమని పేర్కొన్నారు.

ప్రస్తుత సమాజంలోని పరిస్థితులపై వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజూ పత్రికల్లో వస్తున్న కొన్ని వార్తలను చూస్తుంటే సిగ్గేస్తోందని, పాశ్చాత్య వ్యామోహంలో పడి మన సంస్కృతిని విస్మరిస్తున్నామని మండిపడ్డారు. సమాజం గతితప్పినప్పుడే యోగి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వంటి మహానుభావులు జన్మిస్తారని, ఆధ్యాత్మికత వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు.

Go Back to Shorts
Nara Lokesh
Venkaiah Naidu
AP Education
Andhra Pradesh Education
10th Class Results
Government Schools
Vishwambharudu Book
Golagamudi
Venkateswara Swamy
Family Values

More Telugu News