సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు

  • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి
  • ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన
  • ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత వెంకట్ జాస్తికి అభినందనలు
  • సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ అని వెల్లడి
ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో పాటు వారి ఆరోగ్యానికి కూడా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జీఎన్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కంటి ఆసుపత్రి ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తిని ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే గొప్ప లక్ష్యంతో జాస్తి ముందుకు రావడం ప్రశంసనీయమని, ఆయన సహకారంతో ఈ ప్రాంతంలోని పేదలకు సైతం ఉత్తమ నేత్ర వైద్యం అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాదికి 50 వేల మందికి పైగా ఔట్ పేషెంట్లకు సేవలు అందించే సామర్థ్యంతో, ఏటా 5 వేల వరకు శస్త్రచికిత్సలు చేసేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దడం సంతోషకరమని అన్నారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా ఎల్వీ ప్రసాద్ సంస్థ అందిస్తున్న సేవలను సీఎం కొనియాడారు.

తమ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ, గత బడ్జెట్ కంటే ఈసారి ఏకంగా రూ.19,305 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థులకూ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, 'సంజీవని' ప్రాజెక్టు ద్వారా ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించి, మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు.

ప్రారంభోత్సవం అనంతరం, ముఖ్యమంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అక్కడి ఆధునిక యంత్రంతో వైద్యులు ఆయనకు కంటి పరీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్రం వైద్యులు, సిబ్బందితో పాటు దాత వెంకట్ జాస్తి కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించారు.



Chandrababu Naidu
LV Prasad Eye Care
Andhra Pradesh
Gudlavalleru
Venkat Jasti
Eye Care
Health Services
Krishna District
Cataract Operations
Digital Health Records

More Telugu News