విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!
- ఇప్పటికే తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించిన కేంద్రం
- రెండో దశ ప్యాకేజీ ఫైల్ ను ఇప్పటికే క్లియర్ చేసిన కుమారస్వామి
- విశాఖ ప్లాంట్ లో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కి, ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుంది. గత ఏడాది అందించిన రూ. 11,440 కోట్ల సాయానికి అదనంగా, ఇప్పుడు మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ఉక్కు శాఖ రంగం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపిన సంప్రదింపులతో తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందింది. ఇందులో రూ. 10,300 కోట్లు ఈక్విటీగా, మిగిలిన రూ. 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల రూపంలో అందాయి. ప్రస్తుతం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి రావడంతో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ పురోగతి దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే అదనపు నిధుల అవసరం ఉందని గుర్తించిన కేంద్రం, ఈ రెండో దశ ప్యాకేజీ ద్వారా ప్లాంట్‌ను పూర్తిస్థాయి లాభాల బాటలోకి తీసుకురావాలని భావిస్తోంది.