విద్యాశాఖలో లోకేశ్‌ మార్క్.. ఫొటోల్లేకుండానే విద్యార్థుల ఫలితాల ప్రకటన

Minister Nara Lokesh Mark in in the Education Department
  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలతో వినూత్న ప్రచారానికి శ్రీకారం
  • సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా విద్యార్థుల ఫొటోలతోనే పేపర్ ప్రకటనలు
  • రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్‌
  • ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి వంటి మహనీయుల పేర్లు
  • స్కూల్ వస్తువులపై నేతల ఫొటోలు, పార్టీ రంగులు ఉండవన్న మంత్రి
ఏపీ విద్యావ్యవస్థలో నూతన శకానికి నాంది పలుకుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిభను చాటిచెబుతూ, రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వివరాలతో ప్రముఖ దినపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలంటే ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల ఫొటోలు, ప్రభుత్వ నినాదాలతో నిండి ఉంటాయి. కానీ, ఈ ప్రకటనలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. వీటిలో ఎక్కడా సీఎం చంద్రబాబు నాయుడు గానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటోలు గానీ కనిపించవు. కేవలం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు, వారు చదివిన ప్రభుత్వ పాఠశాలల వివరాలను మాత్రమే ప్రముఖంగా ప్రచురించారు. "ప్రభుత్వ విద్యాలయాలు సగర్వంగా నిలబడి" అనే ఆత్మవిశ్వాసం మినహా ఎలాంటి రాజకీయ ప్రచార ఆర్భాటాలకు తావివ్వలేదు. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభకే అసలైన గుర్తింపు ఇస్తున్నామనే స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం పంపింది.

రాజకీయాలకు దూరం.. మహనీయులకు దగ్గర
విద్యా రంగాన్ని రాజకీయ రంగులకు దూరంగా ఉంచాలనేది తన ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే స్పష్టం చేస్తున్నారు. ఈ ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం' అని, విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే కార్యక్రమానికి 'డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర' అని నామకరణం చేశారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి స్ఫూర్తిప్రదాతల పేర్లను ఇతర పథకాలకు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అంతేగాక‌ విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తువులు, ఇతర వస్తువులపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు గానీ, కూటమి ప్రభుత్వ రంగులు గానీ ముద్రించవద్దని లోకేశ్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా విద్యాశాఖను నడపాలని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సుశిక్షితులైన ఉపాధ్యాయుల ద్వారా "అమ్మలా శిక్షణ, నాన్నలా రక్షణ" అందిస్తామని, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఈ ప్రకటనల ద్వారా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ చర్యల ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను నిలపాలన్న మంత్రి లోకేశ్‌ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
Go Back to Shorts
Nara Lokesh
Education Department
Andhra Pradesh
AP SSC Results 2026

More Telugu News