ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన

  • అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్
  • ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లలో 157 స్ట్రైక్ రేటుతో అదరగొట్టిన క్లాసెన్
  • రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా దక్షిణాఫ్రికా బోర్డు ఒప్పించాలని సూచన
హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, అతని పవర్ హిట్టింగ్ ఇప్పటికీ చాలామందిని ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న 34 ఏళ్ల క్లాసెన్ భారీ పరుగులు సాధిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లలో 157కు పైగా స్ట్రైక్ రేటుతో 414 పరుగులు చేసి టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 65 పరుగులతో అదరగొట్టాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికా బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. అంతర్జాతీయ టోర్నీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని సూచించాడు. దక్షిణాఫ్రికా జట్టులోకి అతడు తిరిగి వస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. అయితే ఇప్పటి వరకు ఈ జట్టు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేదు. ఇప్పుడు స్వదేశంలో టోర్నీ జరగడం వారికి కలిసి వచ్చే అంశం. ఈ క్రమంలో మంచి ఫామ్‌లో ఉన్న క్లాసెన్ ఆ జట్టు తరఫున ఆడితే వారికి కలిసి వస్తుందని కేపీ అభిప్రాయపడ్డాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్లాసెన్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని, రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని అన్నాడు. క్లాసెన్ ఫామ్ చూస్తుంటే స్వదేశంలో జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను సత్తా చాటగలడని పేర్కొన్నాడు. అతడి లాంటి ఆటగాళ్లు ప్రస్తుతం దొరకరని కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించాడు.

Kevin Pietersen urges Heinrich Klaasen
IPL
World Cup
International Cricket

More Telugu News