అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత

  • 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందన్న కవిత
  • నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపాటు
  • జీవో 30ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో విపక్ష గళాన్ని బలంగా వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సేన (TRS) చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... నిరుద్యోగ నియామకాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా జీవో నెం.30 ద్వారా ఉద్యోగ వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం, ఆ రెండేళ్ల గడువులో సరైన నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. 


వయసు సడలింపు గడువు ముగిసిన వెంటనే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తూ, అందులో అర్హత వయస్సును కేవలం 18 నుంచి 34 ఏళ్లుగా పేర్కొనడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆమె ఎండగట్టారు.


నిరుద్యోగులకు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకునే ధోరణిని సహించబోమని హెచ్చరిస్తూ, ఏప్రిల్ 20న జారీ చేసిన అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. జీవో 30ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని ఆమె సూచించారు.


Kavitha
Kalvakuntla Kavitha
TRS
Telangana
Assistant Scientist Jobs
Pollution Control Board
Job Notification
Government Jobs
Unemployment
Age Limit

More Telugu News