అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

  • వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు
  • అన్నపై ప్రియురాలు ఇచ్చిన వేధింపుల కేసులో చెల్లెలి పేరు
  • ధారూరులో అద్దె గదిలో ఉరేసుకుని బలవన్మరణం
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సొంత అన్న ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నారు. తన అన్న ప్రియురాలు ఇచ్చిన పోలీసు ఫిర్యాదులో తన పేరు కూడా చేర్చడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ధారూరులో బుధవారం ఉదయం వెలుగుచూసింది.

ధారూరుకు చెందిన డేగావత్ తులసీబాయి (23) వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె అన్న రాజు స్థానికంగా ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ తోటి ఉద్యోగిని మౌనికతో ప్రేమలో పడ్డాడు. ఏడాది కాలంగా మౌనికను తన చెల్లెలు తులసీబాయి అద్దె గదిలోనే ఉంచాడు. అయితే, ఇటీవల రాజు, మౌనిక మధ్య గొడవలు జరగడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత, పాత ఫోటోలు చూపి రాజు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ మౌనిక ఈ నెల 27న కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్న రాజుకు అతడి చెల్లెలు, కానిస్టేబుల్ అయిన తులసీబాయి కూడా సహకరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. అన్న ప్రేమ వ్యవహారంలో అనవసరంగా తనపై కేసు నమోదు కావడంతో తులసీబాయి తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అద్దె గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman Constable
Vikarabad
Love
Telangana
Crime News

More Telugu News