డ్రెస్సింగ్ రూంలో వేపింగ్.. చిక్కుల్లో రియాన్ పరాగ్.. గతంలో డివిలియర్స్, ఫించ్ కూడా..!

Riyan Parag Not The First Cricketer To Be Caught Vaping In Dressing Room Full List Here
  • ఐపీఎల్ డ్రెస్సింగ్ రూంలో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన రియాన్ పరాగ్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. బీసీసీఐ విచారణకు డిమాండ్లు
  • భారత్‌లో ఈ-సిగరెట్లపై నిషేధం.. పరాగ్‌పై కఠిన చర్యలకు ఆస్కారం
  • ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగిన వైనం
  • ఎస్ఏ20 లీగ్‌లో ఏబీడీ.. ఆసీస్‌ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఇలాగే వేపింగ్‌
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) యువ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూంలో వేపింగ్ (ఈ-సిగరెట్) తాగుతూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రీడా వర్గాల్లో కలకలం రేగింది. పరాగ్ ప్రవర్తనపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీసీసీఐ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. 2026 జనవరిలో జరిగిన ఎస్ఏ20 లీగ్‌లో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. అయితే, దక్షిణాఫ్రికాలో వేపింగ్ చట్టవిరుద్ధం కాకపోవడంతో అతను ఎలాంటి శిక్షకు గురికాలేదు. 2020లో ఐపీఎల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. కానీ, భారత చట్టాల ప్రకారం పరాగ్ పరిస్థితి భిన్నంగా ఉంది.

ఈ వివాదం రియాన్ పరాగ్‌కు అత్యంత క్లిష్ట సమయంలో ఎదురైంది. సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్ల పరాగ్, ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 81 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న అతనికి ఈ వివాదం కొత్త తలనొప్పిగా మారింది.

అయితే, ఈ వివాదం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపలేదు. పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించి, ఈ సీజన్‌లో పంజాబ్‌కు తొలి ఓటమిని రుచిచూపింది. ఈ ఘటనపై ఇప్పటివరకు బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గానీ, రియాన్ పరాగ్ గానీ అధికారికంగా స్పందించలేదు.
Go Back to Shorts
Riyan Parag
Vaping
Dressing Room
Rajasthan Royals
AB de Villiers
Aaron Finch

More Telugu News