మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ

  • నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు సిద్ధమైన వినేశ్ ఫోగాట్
  • రిజిస్ట్రేషన్ పోర్టల్ మూసివేసినట్టు చూపిస్తోందన్న వినేశ్
  • ఫోగాట్ ఆరోపణలను ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పునరాగమనం విషయంలో తలెత్తిన వివాదం క్రీడా రంగంలో చర్చనీయాంశంగా మారింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్న వినేశ్, వచ్చే నెలలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. అయితే ఈ టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 30 వరకు గడువు ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ పోర్టల్ ముందే మూసివేసినట్లు చూపిస్తోందని ఆమె ఆరోపించారు. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ అధికారులకు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపినా ఎవరూ స్పందించడం లేదని, కావాలనే తనను పోటీలకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు అర్హత సాధించాలంటే ఈ టోర్నమెంట్ ఆమెకు ఎంతో కీలకం.


మరోవైపు, వినేశ్ చేసిన ఆరోపణలను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఖండించారు. వినేశ్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయిందని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఇతర రెజ్లర్లు అధికారులను సంప్రదించి పరిష్కరించుకున్నారని... కానీ వినేశ్ మాత్రం నేరుగా మీడియా ముందుకు వెళ్లి అనవసరపు వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. క్రీడాకారులు ఇలాంటి విషయాలపై రాద్ధాంతం చేయకుండా ఆటపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.


Vinesh Phogat

More Telugu News