హైదరాబాద్‌లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం.. వెలుగులోకి అమానుష దందా

  • హైదరాబాద్‌లో వెలుగు చూసిన జంతువుల బ్లడ్ రాకెట్
  • వీధి కుక్కలను బంధించి రక్తాన్ని అమ్ముతున్న ప్రైవేట్ ఆసుప‌త్రి
  • ఒక్కో బ్లడ్ ప్యాకెట్‌కు రూ. 25 వేల వరకు అక్రమ వసూళ్లు
  • జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు
  • ఆసుప‌త్రి రికార్డులు స్వాధీనం, కొనసాగుతున్న విచారణ
మనుషుల అవయవాలు, రక్తంతో వ్యాపారం చేయడం గురించి విన్నాం. కానీ, ఇప్పుడు కొందరు అక్రమార్కులు మూగజీవాలను కూడా వదలకుండా వాటి రక్తంతో అక్రమ దందాకు తెరలేపిన అమానుష ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలోని షేక్‌పేటలో ఉన్న ఒక ప్రైవేట్ వెటర్నరీ ఆసుప‌త్రిలో వీధి కుక్కల రక్తాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న రాకెట్‌ను అధికారులు గుర్తించారు. ఈ దారుణంపై జంతు ప్రేమికులు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయడంతో పాటు, జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ సైతం రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చింది.

ఆసుప‌త్రి నిర్వాహకుల నేరపూరిత విధానం అత్యంత క్రూరంగా ఉంది. మొదట వీధి కుక్కలను పట్టుకొచ్చి ఆసుప‌త్రిలోని బోన్లలో బంధిస్తారు. తర్వాత అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చే ఖరీదైన పెంపుడు కుక్కల యజమానులను లక్ష్యంగా చేసుకుంటారు. వారి పెంపుడు జంతువులకు రక్తహీనత ఉందని నమ్మించేందుకు తప్పుడు రిపోర్టులు సృష్టిస్తారు. ప్రాణాలు కాపాడాలంటే వెంటనే రక్తం ఎక్కించాలని భయపెట్టి, బందీగా ఉన్న వీధి కుక్కల నుంచి తీసిన రక్తాన్ని ఒక్కో ప్యాకెట్‌కు రూ. 18 వేల నుంచి రూ. 25 వేల వరకు అమ్ముతున్నారు. ఆస్పత్రి సిబ్బంది ద్వారా బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఈ క్రూరత్వాన్ని కళ్లకు కట్టాయి.

ఈ అమానవీయ ప్రక్రియలో నిరంతరం రక్తాన్ని బలవంతంగా తీయడం వల్ల బందీగా ఉన్న వీధి కుక్కలు తీవ్ర రక్తహీనతకు గురై చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్నిసార్లు, చికిత్స కోసం వచ్చిన ఇతర పెంపుడు జంతువుల నుంచి కూడా యజమానుల అనుమతి లేకుండా రక్తాన్ని సేకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న జంతువు యజమాని సమ్మతితోనే రక్తదానం లేదా రక్తమార్పిడి జరగాలి. కానీ ఇక్కడ ఎలాంటి నియమాలు పాటించకుండా వ్యాపారమే పరమావధిగా ఈ దందా కొనసాగుతోంది.

నగరంలో జంతువుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ రక్త నిధి కేంద్రాలు లేకపోవడమే ఇలాంటి మాఫియాలు పుట్టుకురావడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదులు అందడంతో జీహెచ్‌ఎంసీ పశువైద్యాధికారులు ఆసుపత్రిపై దాడులు చేసి, రికార్డులను, నిల్వ ఉంచిన రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Dog Blood
Trade
Shaikpet Private Hospital
Hyderabad

More Telugu News