ప్రపంచ బ్యాడ్మింటన్ పాలకవర్గంలో పీవీ సింధు.. ఓటింగ్ హక్కులున్న సభ్యురాలిగా నియామకం

PV Sindhu Appointed to Badminton World Federation Council
  • బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌లో పూర్తి స్థాయి ఓటింగ్ సభ్యురాలిగా సింధు
  • బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా ఎన్నిక కావడంతో ఈ అవకాశం
  • 2026-2029 కాలానికి అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా బాధ్యతలు
  • క్రీడాకారుల గొంతుకను ప్రపంచ వేదికపై వినిపించనున్న సింధు
  • సింధు నియామకాన్ని స్వాగతించిన బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన కెరీర్‌లో మరో అరుదైన ఘనత సాధించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్‌లో పూర్తిస్థాయి ఓటింగ్ హక్కులున్న సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. క్రీడలో చురుకుగా కొనసాగుతూనే ప్రపంచ పాలకమండలిలో కీలక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆమె ఈ ఘనతను అందుకున్నారు.

బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌ పర్సన్ గా ఎన్నిక కావడంతో సింధుకు ఈ గౌరవం దక్కింది. గత డిసెంబర్‌లో 2026-2029 కాలానికి గాను ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈ హోదాలో ఆమె బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌లో అధికారికంగా అడుగుపెట్టారు. హార్సెన్స్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె తొలిసారిగా పాల్గొన్నారు. 2017 నుంచి అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా, 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ అంబాసిడర్‌గా సింధు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నియామకంపై సింధు హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల గొంతుకను వినిపించే బాధ్యతను స్వీకరించడం నిజంగా గర్వంగా, గౌరవంగా ఉంది. బ్యాడ్మింటన్ నాకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు ఈ క్రీడ అభివృద్ధికి నా వంతు కృషి చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను" అని సింధు ఒక ప్రకటనలో తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ ఖున్‌యింగ్ పటామ లీస్వాడ్‌ట్రాకుల్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడలో అత్యున్నత స్థాయిలో కొనసాగుతూనే, ప్రపంచ పాలక మండలిలో ఓటింగ్ హక్కులతో పదవిని చేపట్టడం చాలా అరుదని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. సింధు నియామకం ద్వారా క్రీడాకారుల అనుభవాలు, ప్రాధాన్యతలను నేరుగా ఉన్నత స్థాయి నిర్ణయాలలో చేర్చడానికి వీలు కలుగుతుందని వివరించింది.

"సింధు కోర్టులో అద్భుతమైన నైపుణ్యం, స్ఫూర్తిని ప్రదర్శించారు. ఇప్పుడు మా క్రీడాకారుల గొంతుకకు ఆమె ప్రతినిధిగా ఉండటం అభినందనీయం. క్రీడాకారులే మా క్రీడకు గుండెకాయ లాంటివారు. ప్రతి నిర్ణయంలో వారి అభిప్రాయాలు కీలకం" అని బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ ఖున్‌యింగ్ పటామ లీస్వాడ్‌ట్రాకుల్ అన్నారు. సింధుతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.
Go Back to Shorts
PV Sindhu
Badminton World Federation
BWF Council
BWF Athletes Commission
Khunying Patama Leeswadtrakul
Badminton
Indian Shuttler
Olympics
Sports Governance
Athlete Representation

More Telugu News