కేసీఆర్ పాలనలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నా.. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి: కవిత

Kalvakuntla Kavitha Apologizes for Role in KCR Governance
  • ఫామ్ హౌస్‌లో పెద్దసారు ఉండాలి, చిన్నసారు ముఖ్యమంత్రి కావాలని చురక
  • మన యుద్ధం మూడు పార్టీలపై ఉంటుందన్న కవిత
  • నాడు ఉప ఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపణ
కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదని, ఆనాడు పరిపాలించిన కుటుంబంలో తాను భాగస్వామినైనందుకు తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. సామాజిక తెలంగాణ కోసం అవతలివాడు మనవాడైనా యుద్ధం చేయడానికి పాంచజన్యం పూరిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందంటే, ఫామ్ హౌస్‌లో పెద్దసారు ఉండాలి, చిన్నసారు ముఖ్యమంత్రి కావాలనే విధంగా ఉందని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి విమర్శించారు. మన యుద్ధం మూడు పార్టీలపై ఉంటుందని అన్నారు. ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తామని అన్నారు.

నాడు ఉపఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ కలలతో మనం తెలంగాణను సాధించుకున్నామో అవి నిజం కాలేదని ఆమె అన్నారు. ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని విమర్శించారు.

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైందని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏం పనులు జరగాలో కేసీఆర్ పాలనలో అవి జరగలేదని ఆరోపించారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావించామని, కానీ రైతులకు బేడీలు పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతా నిఘా నీడలో ఉందని అన్నారు.

కేసీఆర్ పాలనలో తానూ భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానని, అందుకే ప్రజలను క్షమించమని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ సాధించినందుకు గర్విస్తున్నాను కానీ పాలన సమయంలో తప్పులో భాగస్వామినైనందుకు ఆవేదనగా ఉందని అన్నారు. అందుకు తాను కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, సామాజిక తెలంగాణ కోసం నడుం బిగించి కష్టపడి పని చేయాలని అన్నారు.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
Telangana
KCR
BRS
Telangana Rashtra Samithi
Telangana State Sena
Telangana Politics

More Telugu News