ఆర్టీసీ డ్రైవర్ మృతికి రేవంత్ రెడ్డే కారణం: హరీశ్ రావు

  • నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్
  • 80 శాతం గాయాలతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • ప్రభుత్వ అలసత్వం వల్లే శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారన్న హరీశ్
  • ఇలాంటి ప్రాణ త్యాగాలకు ఎవరూ పాల్పడవద్దని సూచన

వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్, 80 శాతం గాయాలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఆయన మృతితో రాష్ట్రంలో విషాదం నెలకొంది. 


ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వం వల్లే శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.


శంకర్ గౌడ్ అమరుడైన రోజును 'అప్పాయింటెడ్ డే'గా ప్రకటించి ఆయన త్యాగాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి తప్ప, ఎవరూ ఇలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం స్వస్థలానికి తరలిస్తున్నారు. ఇవాళ జరిగే అంత్యక్రియలకు భారీ సంఖ్యలో కార్మికులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో వరంగల్, నర్సంపేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.



Revanth Reddy
Harish Rao
RTC driver suicide
Shankar Goud
Telangana RTC
BRS party
Narsampet
Warangal
Congress government
RTC workers

More Telugu News