భగ్గుమంటున్న ఏపీ.. పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

High temperatures recorded in AP
  • రాష్ట్రంలోని 151 మండలాలకు ఈదురుగాలుల హెచ్చరిక
  • 62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలుల సూచన
  • పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి కొనసాగుతున్న ఎండల తీవ్రత
  • శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాష్ట్రంలోని 62 మండలాల్లో తీవ్రమైన ఈదురుగాలులు, మరో 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అదనంగా మరో 7 మండలాల్లో తీవ్రమైన, 31 మండలాల్లో సాధారణ గాలులు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్, కడపలో 45.1, మన్యం జిల్లా సాలూరులో 45.1, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విపరీత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Go Back to Shorts
Summer
Heat Wave
High Temperatures
Andhra Pradesh

More Telugu News