తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు, ప్రయాణికులకు తిప్పలు

TGSRTC Strike Telangana buses halt passengers face trouble
  • తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె నిర్ణయం
  • ఎన్నికల హామీలు అమలు చేయాలని కార్మికుల డిమాండ్
  • ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంతో మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా ప్రకటించినట్లుగానే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో బస్సులు బయటకు రాకుండా నిలిచిపోయాయి. ఫలితంగా ఇవాళ‌ ఉదయం నుంచే కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన 32 హామీలను తక్షణమే అమలు చేయాలని కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కార్మికులు బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కూడా బలంగా వినిపిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్ సహా అన్ని జిల్లాల్లోనూ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ రీజియన్‌లో 641 బస్సులు ఆగిపోగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది డిపోలకు చెందిన 850 బస్సులు నిలిచిపోయాయి. వేలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల అద్దె బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే, అవి ప్రయాణికుల రద్దీకి సరిపోకపోవడంతో చాలామంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
Go Back to Shorts
TGSRTC Strike
RTC strike
Telangana RTC strike
Telangana bus strike
RTC workers strike
Telangana news
Hyderabad news
Bus strike Telangana
Congress party
Telangana government

More Telugu News