ఏసీబీ వలలో లంచావతారాలు.. ఒకేరోజు మహిళా సీఐ, ఎస్సై, ఆర్డీవో అరెస్ట్

Women CI SI and RDO Caught Red handed To ACB
  • జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం తీసుకున్న నారాయణపేట ఆర్డీవో
  • వరకట్న వేధింపుల కేసులో బెయిల్ కోసం రూ. 60 వేలు డిమాండ్ చేసిన సీఐ, ఎస్సై
  • నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరిక 
తెలంగాణలో లంచగొండి అధికారులు ఏసీబీకి వరుసగా పట్టుబడుతున్నారు. తాజాగా మంగళవారం ఒక్కరోజే వికారాబాద్‌లో ఇద్దరు మహిళా పోలీసు అధికారులు, నారాయణపేటలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. 

తాండూరుకు చెందిన ఇర్షాద్ అనే వ్యక్తిపై అతని భార్య పెట్టిన వరకట్న వేధింపుల (498ఏ) కేసుకు సంబంధించి, ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్సై రాణి రూ.60 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు గత నెలలో రూ.20 వేలు చెల్లించినా, మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం బాధితుడి నుంచి మిగిలిన రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.

మరోవైపు నారాయణపేటలో ఆర్డీవో రాంచందర్ కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఊట్కూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఐదు జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, పది నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.25 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను కార్యాలయంలోనే పట్టుకుంది.

కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరి తీరు మారడం లేదు. తాజా ఘటనతో గత నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరింది. గతంలో సిరిసిల్ల, నిర్మల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఎస్ఐలు, హైదరాబాద్ విమానాశ్రయంలో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Go Back to Shorts
ACB
Telangana
Women CI
SI
Bribe
Vikarabad
Narayanpet

More Telugu News