టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

  • ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు మృతి
  • గుండెపోటుతో హైదరాబాద్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస
  • 12 సినిమాలకు దర్శకత్వం.. 30కి పైగా చిత్రాల్లో నటించిన చిట్టిబాబు
  • దివంగత నటి సౌందర్యను పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

కృష్ణా జిల్లా కాజా గ్రామానికి చెందిన చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన త్రిపురనేని మహారథి వారసత్వంగా సినీ రంగంలోకి ప్రవేశించారు. తొలినాళ్లలో ఆత్రేయ, అప్పలాచార్య వంటి దిగ్గజాల వద్ద రచనా విభాగంలో సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 'సంతానం' సినిమాతో దర్శకుడిగా మారారు.

చిట్టిబాబు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. 12 చిత్రాలకు దర్శకత్వం వహించగా, 49 సినిమాలకు కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. అంతేగాక‌ సుమారు 30కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాతగానూ పలు చిత్రాలను నిర్మించారు.

దివంగత నటి సౌందర్యను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది చిట్టిబాబే కావడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tripuraneni Chittibabu
Passed Away
Tollywood Producer
Telugu Cinema
Tollywood

More Telugu News