మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్

  • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే మహిళలనే ఓడించాయన్న‌ చంద్రబాబు 
  • నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ
  • తమిళనాడులో అభివృద్ధి కుంటుపడి, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ
  • చెన్నై-బెంగళూరు-అమరావతి హై స్పీడ్ రైలు కారిడార్‌ను కేంద్రం ఆమోదించిందని వెల్లడి
తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీలు కేంద్రాన్ని కాదని, మహిళలనే ఓడించాయని ఆయన ఘాటుగా విమర్శించారు. తాను దక్షిణాది రాష్ట్రాల పక్షాన మాట్లాడుతున్నానని స్పష్టం చేస్తూ, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రధానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... "నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50% సీట్లు పెంచి, ఆ పెరిగిన సీట్లపై మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనేది మా ఫార్ములా. దీనివల్ల మహిళలకు న్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఇంతకంటే మంచి ఫార్ములా ఉంటుందా? ఈ బిల్లును అడ్డుకున్న రాహుల్ గాంధీ, స్టాలిన్‌లు ఏం సాధించారు?" అని ప్రశ్నించారు.

తమిళనాడుతో ఏపీకి ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి తాగునీరు అందించారని, తమిళ ప్రజలు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారని ప్రశంసించారు. అయితే, ప్రస్తుత డీఎంకే పాలనలో తమిళనాడులో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ఆరోపించారు. "చెన్నై లాంటి నగరం నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ వాడకం పెరిగిపోయాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. చెన్నై రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు భారీగా నిధులు కేటాయించారని, త్వరలో చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలను కలిపే హై స్పీడ్ రైలు కారిడార్‌ను కేంద్రం ఆమోదించిందని వెల్లడించారు. దేశానికి ఒక సంస్కరణవాది ప్రధానిగా ఉన్నారని, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీని కేంద్రం ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Chandrababu
Congress
DMK
Tamil Nadu

More Telugu News