ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడంపై వెంకట్రామిరెడ్డి స్పందన

Venkatrami Reddy response on dismisal from job
  • గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారంటూ వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు
  • ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం
  • తనను అడ్డగోలుగా డిస్మిస్ చేశారన్న వెంకట్రామిరెడ్డి
  • న్యాయస్థానంలో తేల్చుకుంటానని వెల్లడి
  • వైసీపీకి అనుకూలంగా తాను ప్రచారం చేయలేదని స్పష్టీకరణ

తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వం తనను అడ్డగోలుగా డిస్మిస్ చేసిందని, దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 


గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్నానని, తనకు ఇంకా 14 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు కనీస ఆధారాలు కూడా లేవని... కేవలం ఉద్యోగ సంఘం నాయకుడిగా ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.


2014-19 మధ్య కాలంలో కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని, కానీ వారిపై ఇలాంటి డిస్మిస్ చర్యలు ఎప్పుడూ తీసుకోలేదని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులు ఎవరూ నోరు మెదపకూడదనే భయం సృష్టించేందుకే ప్రభుత్వం ఈ వేటు వేసిందని విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను చట్టపరంగా సవాలు చేస్తానని వెల్లడించారు.

Go Back to Shorts
Venkatrami Reddy
YSRCP

More Telugu News