వాట్ ఏ జర్నీ... పూరీ జగన్నాథ్ కెరీర్ పై విజయ్ సేతుపతి ట్వీట్

  • భారత చలనచిత్ర పరిశ్రమలో 26 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్
  • డాషింగ్ డైరెక్టర్‌కు నటుడు విజయ్ సేతుపతి ప్రత్యేకంగా శుభాకాంక్షలు
  • పూరీ ప్రయాణం ధైర్యం, నమ్మకంతో నిర్మించిన ఒక లెగసీ అని ప్రశంస
  • పూరీ దర్శకత్వంలో ‘స్లమ్‌డాగ్’ చిత్రంలో నటిస్తున్న విజయ్ సేతుపతి 
  • పూరీతో పనిచేయడం గొప్ప అనుభవమని వ్యాఖ్య
టాలీవుడ్ డైనమిక్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ భారత చలనచిత్ర పరిశ్రమలో 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన దర్శకత్వంలో ‘స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పూరీ జగన్నాథ్‌పై ప్రశంసలు కురిపిస్తూ విజయ్ సేతుపతి ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. "ఈ 26 ఏళ్ల ప్రయాణం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ధైర్యం, నమ్మకం, నిర్భయ స్వరంతో నిర్మించిన ఒక గొప్ప లెగసీ. ఆయన స్ఫూర్తినిస్తూ, ఉత్తేజపరుస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పూరీ గారూ, మీతో కలిసి ‘స్లమ్‌డాగ్’ చిత్రానికి పనిచేయడం గొప్ప అనుభవం. నటులుగా మమ్మల్ని నమ్మి, మా కంఫర్ట్ జోన్‌ల నుంచి బయటకు నెట్టే దర్శకులు కావాలి. మీరు ఆ పనిని చాలా సులువుగా చేస్తారు. ఈ సినిమా మనందరికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను," అని పేర్కొన్నారు.

పూరీ మరిన్ని విజయాలు సాధించి, ప్రభావవంతమైన కథలతో ప్రేక్షకులను అలరించాలని విజయ్ సేతుపతి ఆకాంక్షించారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై ఛార్మి కౌర్‌తో కలిసి పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త, బ్రహ్మాజీ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. 'స్లమ్‌డాగ్' చిత్ర బృందం కూడా పూరీకి శుభాకాంక్షలు తెలియజేసింది.

Puri Jagannadh
Vijay Sethupathi
Slumdog
Charmme Kaur
Telugu cinema
Tollywood
Indian film industry
Tabu
Samyukta
Brahmaji

More Telugu News