డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్ని కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు: వరుణ్ చక్రవర్తి

varun chakravarthy on KKR first win in IPL
  • ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న కేకేఆర్
  • రాజస్థాన్ జట్టుపై విజయం సాధించిన కేకేఆర్
  • డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారన్న వరుణ్ చక్రవర్తి

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రింకూ సింగ్, అనుకూల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించారు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు ఓటములు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో డీలా పడ్డ కేకేఆర్ క్యాంప్‌లో ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. 


ఈ గెలుపు ఎంతటి ప్రాముఖ్యమైనదో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాటల్లో వ్యక్తమైంది. "ఈ రోజు మా డ్రెస్సింగ్ రూమ్‌లో నేను చూసినన్ని కన్నీళ్లు.. 2024లో మేము టైటిల్ గెలిచినప్పుడు కూడా చూడలేదు" అని అతడు వ్యాఖ్యానించడం జట్టుపై ఉన్న ఒత్తిడికి అద్దం పడుతోంది.


ఈ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి తన మునుపటి ఫామ్‌ను చాటుకోవడమే కాకుండా, కేకేఆర్ తరపున 100 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా (సునీల్ నరైన్, రస్సెల్ తర్వాత) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ సీజన్ ఆరంభం నుంచి తాను తీవ్రమైన గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు వరుణ్ వెల్లడించాడు. సీజన్ ప్రారంభానికి ముందే ఎడమ చేతి రెండు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయని, దానివల్ల ఫీల్డింగ్ చేయడం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 


జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే తీవ్ర విమర్శల ప్రభావం తమపై పడకుండా కోచింగ్ స్టాఫ్ తమకు అండగా నిలిచారని వరుణ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఒక్క విజయం తమలో నమ్మకాన్ని పెంచిందని, మెల్లగా జట్టు మళ్లీ గాడిలో పడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.



Go Back to Shorts
Varun Chakravarthy
KKR
IPL

More Telugu News