యంగ్ సెన్సేషన్ వైభవ్‌కు దిగ్గజాల హెచ్చరిక.. సచిన్‌ను చూసి నేర్చుకోమన్న భోగ్లే!
- మేనేజ్‌మెంట్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సైమన్ డూల్
- పనితీరు పడిపోతే వాళ్లే వదిలేస్తారని వ్యాఖ్య
- సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా చూపిన హర్షా భోగ్లే
- కీర్తిని కాపాడుకోవాలంటే బలమైన కుటుంబ మద్దతు అవసరమని సూచన
క్రిక్‌బజ్‌తో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో సైమన్ డూల్ మాట్లాడుతూ.. వైభవ్ చుట్టూ ఉండే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. "వైభవ్ ఇప్పటికే ఒక స్టార్. ఇదే కొనసాగితే సూపర్‌స్టార్ అవుతాడు. కానీ, తన చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేదే ముఖ్యం. ఎన్నో మేనేజ్‌మెంట్ కంపెనీలు అతని కోసం ప్రయత్నిస్తాయి. కానీ, చాలా కంపెనీలు ఆటగాడి శ్రేయస్సు కంటే తమ జేబులు నింపుకోవడం గురించే ఆలోచిస్తాయి. ఒకవేళ ఆటగాడి ప్రదర్శన తగ్గితే, వాళ్లు వెంటనే మరో కొత్త సంచలనం కోసం వెతుకుతారు. అందుకే, ఎవరితో ఉంటున్నావనే దానిపై జాగ్రత్త వహించు" అని డూల్ హితవు పలికాడు.
ఇదే అంశంపై హర్షా భోగ్లే స్పందిస్తూ... సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. చిన్న వయసులోనే కీర్తి శిఖరాలను అధిరోహించినా, సచిన్ దారి తప్పకపోవడానికి అతని కుటుంబం అందించిన బలమైన మద్దతే కారణమని గుర్తుచేశాడు. "వైభవ్ చాలా వినయంగా కనిపిస్తున్నాడు. కానీ, భవిష్యత్తులో అతనికి సవాళ్లు ఎదురవుతాయి. సచిన్‌కు అతని కుటుంబం అండగా నిలిచి, దారి తప్పకుండా చూసుకుంది. వైభవ్ కుటుంబం గురించి నాకు తెలియదు. కానీ, అతనికి కూడా అలాంటి బలమైన కుటుంబ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే అది అతనికి చాలా అవసరం" అని భోగ్లే వివరించాడు.
కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మైదానం బయట ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని అనుభవజ్ఞులు అతనికి సూచిస్తున్నారు.