భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

Indian Ships Attacked Iran Envoy Summoned in Delhi
  • హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు
  • ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
  • ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు
  • జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ప్రకటించిన ఇరాన్
  • పలు నౌకలు వెనక్కి మళ్లడంతో పెరిగిన ఉద్రిక్తత
వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం, ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. శనివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఆయన్ను పిలిపించి, ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) బలగాలు, భారత జెండాతో ప్రయాణిస్తున్న ఓ భారీ ముడి చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరిపాయి. అయితే, ఈ ఘటనలో ట్యాంకర్‌తో పాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) కూడా ధృవీకరించింది. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగిందని, ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఐఆర్‌జీసీ గన్‌బోట్లు కాల్పులు జరిపాయని పేర్కొంది. ఇదే ప్రాంతంలో ఓ కంటైనర్ షిప్‌పై కూడా గుర్తు తెలియని వస్తువుతో దాడి జరిగిందని యూకేఎంటీఓ మరో ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, హర్మూజ్ జలసంధిపై తిరిగి తమ పూర్తి నియంత్రణను పునరుద్ధరించుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా తమ నౌకలపై అక్రమంగా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించింది. ఈ ఆంక్షలు తొలగించే వరకు జలసంధిపై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరాన్ ప్రకటన తర్వాత సుమారు 10 నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించకుండా వెనుదిరిగినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ డేటా వెల్లడించింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Go Back to Shorts
Iran Ambassador
Hormuz Strait
Indian Ships
Iran Navy
Oil Tanker
UKMTO
Shipping Security
Geopolitics
India Iran Relations

More Telugu News