ఇక్కడ ఉన్నది 1995 సీఎం... గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు

Chandrababu warns as here it is 1995 CM
  • మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందన్న సీఎం
  • 33% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాడతామని స్పష్టీకరణ
  • గొడ్డలి పార్టీకి కూల్చడం, నరకడమే తెలుసని విమర్శ
  • జూన్ నాటికి పట్టణాల్లో 100 శాతం చెత్త తొలగింపు లక్ష్యం
  • నిడదవోలు నియోజకవర్గానికి పలు అభివృద్ధి హామీలు
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఆగడాలను ఎంతమాత్రం సహించేది లేదని, ఇక్కడ ఉన్నది 1995 నాటి ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గొడ్డలి పార్టీకి తెలిసిందల్లా విధ్వంసం, కూల్చడం, నరకడమేనని, వారి ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

గత ప్రభుత్వం పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను కక్షపూరితంగా మూసివేసిందని, పేదలకు కడుపునిండా అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్రంలో నరేంద్ర మోదీ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు.

గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను
సుపరిపాలన అందించడమే తమ కూటమి లక్ష్యమని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం పోలవరం డయాఫ్రం వాల్‌ను గోదావరిలో కలిపేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, తద్వారా 23 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 

అమరావతికి రాజధానిగా చట్టబద్ధత లభించిందని, గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో పాటు ఇప్పుడు మరో 10 గ్రామాల రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 269 అన్న క్యాంటీన్లు తిరిగి పనిచేస్తున్నాయని, పేదల ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

మహిళా బిల్లును అడ్డుకున్నది కాంగ్రెసే
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా మహిళలను మోసం చేస్తోందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిసారీ అడ్డుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు, తాను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉండగా బిల్లు పెడితే కాంగ్రెస్ సహకరించలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత వాజ్‌పేయి హయాంలో నాలుగుసార్లు బిల్లు తెచ్చినా కాంగ్రెస్ అడ్డుపడిందని ఆరోపించారు. 

2010లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకురాకుండా మహిళలకు ద్రోహం చేసిందన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ పట్టుదలతో బిల్లు తెస్తే, డీలిమిటేషన్ పేరుతో మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి లాజిక్ ఏంటో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మహిళా సాధికారతకు పెద్దపీట
మహిళల సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించిన ఘనత తమ ప్రభుత్వాలదేనని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తుచేశారు. తాను డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశానని, నేడు డ్వాక్రా మహిళలు రూ. 50 వేల కోట్ల రుణాలు తీసుకునే స్థాయికి ఎదిగారని తెలిపారు. 

తమ ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను సూపర్ హిట్ చేసిందని, ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలతో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

జూన్ నాటికి 100% చెత్త క్లియరింగ్
స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చారని, తాము అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో పేరుకుపోయిన 153 లక్షల టన్నుల చెత్తలో ఇప్పటికే 114 లక్షల టన్నులు తొలగించామని, ఈ జూన్ నాటికి 100 శాతం క్లియర్ చేస్తామని ప్రకటించారు. 

చెత్త సేకరణ, ప్రాసెసింగ్‌ను 100 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూ. 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు.

నిడదవోలు అభివృద్ధికి ప్రత్యేక హామీలు
ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ప్రగతి నివేదికను ప్రజల ముందుంచిన చంద్రబాబు, నియోజకవర్గ అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. స్థానికంగా చిన్న కాశిరేవు వంతెన పునర్నిర్మాణం, ఇండోర్ స్టేడియం, ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, కంసాలిపాలెం నుంచి మాధవరం వరకు వంతెన నిర్మాణం, ఎర్రకాలువ గండ్ల పూడ్చివేత, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, కందుల దుర్గేష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
TDP
Pawan Kalyan Narendra Modi
Janasena
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News