అమెరికా దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం: ఇరాన్ హెచ్చరిక

Iran Parliament Speaker Mohammad Bagher Ghalibaf Warns To Shut Strait Of Hormuz If Us Naval Blockade Continues
  • హ‌ర్మూజ్‌పై నౌకా దిగ్బంధనం కొనసాగిస్తామన్న ట్రంప్
  • దిగ్బంధనం ఎత్తేయకుంటే జలసంధిని మ‌ళ్లీ మూసేస్తామని ఇరాన్ హెచ్చరిక
  • వాణిజ్య నౌకల కోసం మార్గం తెరిచామంటూ ఇరాన్ ప్రకటన
  • సోషల్ మీడియా కాదు, క్షేత్రస్థాయే నిర్ణయిస్తుందన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్
హ‌ర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే, ఇరాన్ నుంచి తీవ్రమైన హెచ్చరిక వెలువడింది. దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్ జలసంధిని మ‌ళ్లీ మూసివేయాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ స్పష్టం చేశారు. 

'ఎక్స్‌' (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. "నిర్ణీత మార్గంలో, ఇరాన్ అనుమతితో మాత్రమే హ‌ర్మూజ్ జలసంధి గుండా ప్రయాణాలు సాగుతాయి. దిగ్బంధనం కొనసాగితే, ఈ జలసంధి తెరిచి ఉండదు" అని హెచ్చరించారు. అబద్ధాలతో వారు యుద్ధం గెలవలేదని, చర్చల్లోనూ వారికి ఏమీ దక్కదని ఆయన అన్నారు. జలసంధి తెరిచి ఉంటుందా? లేక మూసి ఉంటుందా? అనే విషయాన్ని క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయని, సోషల్ మీడియా కాదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. గంట వ్యవధిలోనే ట్రంప్ ఏడు అబద్ధపు ప్రచారాలు చేశారని ఆయన ఆరోపించారు.

అంతకుముందు లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగుతున్నంత కాలం వాణిజ్య నౌకల రాకపోకలకు హ‌ర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఇరాన్‌తో తమ 'లావాదేవీ' పూర్తయ్యే వరకు నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని, అయితే ఈ ప్రక్రియ చాలా త్వరగా ముగుస్తుందని తెలిపారు.

ప్రపంచంలోని ఐదో వంతు చమురు సరఫరా హ‌ర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ మార్గం మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ మార్గాన్ని తెరిచినప్పటికీ, స్పష్టమైన భద్రతా హామీలు లభించే వరకు కార్యకలాపాలు ప్రారంభించడానికి వాణిజ్య నౌకా సంస్థలు వెనుకాడుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 
Go Back to Shorts
Bagher Ghalibaf
Strait Of Hormuz
Iran
America

More Telugu News