మీకు మహిళల ఉసురు తగులుతుంది: విపక్షాలపై అమిత్ షా ఫైర్
- లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ
- విపక్షాల వల్లే బిల్లు వీగిపోయిందని అమిత్ షా ఆరోపణ
- కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలపై ఆగ్రహం
- ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్లో ఇది తిరస్కరణకు గురైంది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో ఇది వీగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటింగ్ సమయంలో సభలోనే ఉన్నారు.
ఈ పరిణామంపై అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరితో బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ విషయంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల దక్షిణ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు.