మంచిర్యాల సెగను తట్టుకుని తిరుమల చెంతకు: సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్
- సింగరేణి నేపథ్యంలో సంయుక్త తాజా చిత్రం 'బ్లాక్ గోల్డ్'
- 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం తనను పరీక్షించిందన్న సంయుక్త
- మండుతున్న ఎండలను లెక్క చేయకుండా టీమ్ పనిచేసిందని కితాబు
టాలీవుడ్ ‘గోల్డెన్ లెగ్’ సంయుక్త మీనన్ తన తాజా చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్లో ఎదురైన సవాళ్లను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సినిమా తెరపై ఎంత గ్లామరస్‌గా కనిపించినా, దాని వెనుక చిత్ర యూనిట్ పడే శ్రమ ఎంతటిదో ఆమె పెట్టిన పోస్ట్ నిరూపిస్తోంది.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మంచిర్యాలలో షూటింగ్ నిర్వహించింది. అక్కడ 40 నుంచి 45 డిగ్రీల తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య పనిచేయడం తమను శారీరకంగా, మానసికంగా పరీక్షించిందని సంయుక్త పేర్కొంది. మండుతున్న ఎండలు, తీవ్రమైన అలసట వేధించినప్పటికీ చిత్ర బృందం ఎక్కడా వెనకడుగు వేయకుండా పనిచేసిందని ఆమె కితాబునిచ్చింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా తన పర్సనల్ టీమ్ (నిహారిక, పార్ధు) తీసుకున్న జాగ్రత్తలు, దర్శకుడు యోగి అందించిన ప్రోత్సాహం వల్లే ఈ కఠినమైన షెడ్యూల్‌ను పూర్తి చేయగలిగానని తెలిపింది.
మంచిర్యాల షెడ్యూల్ ముగిసిన వెంటనే సంయుక్త నేరుగా తిరుమలకు చేరుకుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న ఆమె, ఆ ప్రశాంతతలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఎంతటి ఒత్తిడిలో షూటింగ్ ప్రారంభించానో, అంతే ఉత్సాహంతో తిరిగి వస్తున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.