నీటి భద్రత కోసం 'జలధార' యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచన
  • జూన్ చివరి నాటికి వెలిగొండ మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం
  • నేరడి బ్యారేజ్, చింతలపూడి కెనాల్‌కు త్వరలో టెండర్లు
  • రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలాలు.. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణకు చర్యలు
రాష్ట్రంలో నీటి భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలో స్పష్టమైన ‘జలధార యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుడి, ఎడమ కాలువలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులను నింపేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సహా పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, హోటళ్లు, షాపింగ్ ఏరియాలతో పాటు పోలవరం-పాపికొండలు-భద్రాచలం మార్గంలో బోటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎం సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. 

పునరావాస పనులను వేగవంతం చేసి, నిర్వాసితుల తరలింపును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.27,089 కోట్లు ఖర్చు కాగా, మిగిలిన పనులకు మరో రూ.5,108 కోట్లు అవసరమని అధికారులు వివరించారు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు స్టేజ్-1 పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. హంద్రీనీవా ద్వారా ఇప్పటివరకు 52 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని, వంశధార నదిపై ప్రతిష్ఠాత్మకమైన నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగినందున వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెపుడిశెల ప్రాజెక్టు పనులనూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానానికి సంబంధించిన డీపీఆర్‌కు త్వరగా ఆమోదం పొందేలా చూడాలని సూచించారు.

రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ చర్యల వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని అధికారులు సీఎంకు తెలిపారు. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 0.79 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. 

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించేందుకు త్వరగా టెండర్లు పిలవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Polavaram Project
Water Security
Jaladhara Action Plan
Godavari River
Irrigation Projects
Andhra Pradesh
Veligonda Project
Handri Neeva
Water Conservation

More Telugu News