పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ

  • చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో కేసు నమోదు
  • వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్
  • అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతల మండిపాటు

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా వింగ్), మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అరెస్ట్‌ను అక్రమంగా పేర్కొంటూ వైసీపీ నాయకత్వం మండిపడుతోంది. ఈ ఉదయం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలిసి తిరిగి వస్తుండగా, పోలీసులు మార్గమధ్యంలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.


శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పకుండా అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ... ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు వైసీపీ నేతలు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ పౌర హక్కులను కాలరాస్తోందని వారు ఆరోపించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్‌లు (ముఖ్యంగా 'బ్లడ్ హిస్టరీ'కి సంబంధించిన యానిమేటెడ్ విజువల్స్) షేర్ చేసినట్లు చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు, అరెస్ట్ సమయంలో ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.


More Telugu News