నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక
- రేపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు
- దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని సర్వత్ర ఆందోళన
- దక్షిణాదికి అన్యాయం జరిగితే దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందన్న కేటీఆర్
- దక్షిణాది ప్రజల విషయంలో బుద్ధిగా వ్యవహరించాలని కేంద్రానికి హితవు
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనను అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే 2029 సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాలు సమూలంగా మారనున్నాయి.
ఈ నేపథ్యంలో, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా ఈ ప్రక్రియ జరిగితే, అది దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందని ఆయన స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ పాటించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దక్షిణ రాష్ట్రాలకు ఈ పునర్విభజన శాపంగా మారకూడదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని ప్రోత్సహించాల్సింది పోయి, ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి సీట్లు తగ్గితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగిలిపోదని... మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక తీవ్రమైన ప్రజా పోరాటానికి నాంది పలుకుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ గత మూడేళ్లుగా తీసుకున్న స్టాండ్‌కే కట్టుబడి ఉందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నామని పేర్కొంటూ... పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని అణచివేయాలని చూస్తే నిశ్శబ్దంగా ఉండబోమని హెచ్చరించారు. ఢిల్లీ పాలకులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, దక్షిణాది ప్రజల హక్కుల విషయంలో బుద్ధిగా వ్యవహరించాలని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.