ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్
- రెడ్ బుక్ పేరుతో లోకేశ్ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్న భరత్
- అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేయడం అసాధ్యమని వ్యాఖ్య
- జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారని మండిపాటు
ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని నారా లోకేశ్... 'రెడ్ బుక్' పేరుతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఉన్మాదం అనదగ్గ రీతిలో ట్రోలింగ్ జరుగుతోందని అన్నారు. ఫేక్ ఛానల్స్‌తో జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో 'ఆర్గనైజ్డ్ క్రైమ్' జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్ కు ఒకటే చెబుతున్నా... అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు... చట్టం ఎవరికీ చుట్టం కాదు... భవిష్యత్తులో ఆ చట్టం మీ మెడకే చుట్టుకుంటుంది అని హెచ్చరించారు.
అమరావతి నిర్మాణం కోసం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేయడం అసాధ్యమని, అందుకే వైఎస్ జగన్ 'మావిగన్' ప్రతిపాదన తెచ్చారని భరత్ స్పష్టం చేశారు. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి ఒక్కటేనని ఎద్దేవా చేశారు. జనం లేని అమరావతి కంటే, అన్ని వసతులు ఉన్న మావిగన్‌లో రాజధాని నిర్మించడమే ఉత్తమమని ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతిలో రాజధాని కడితే అది నయా రాయపూర్, గాంధీనగర్ లాగా మారుతుందని, సాయంత్రం అయితే అధికారులు విజయవాడకు వెళ్లిపోతారని, అక్కడ ఎవరూ ఉండరని భరత్ వ్యాఖ్యానించారు.
మంత్రులకు సింగపూర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించాలనుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో శిక్షణ ఇప్పిస్తారా? అని ప్రశ్నించారు. గతంలో అమరావతి రైతులను సింగపూర్ తీసుకెళ్లి, చివరికి గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారని ఆరోపించారు.